సినిమా రంగంలో కాలేజీ ఇతివృత్తంగా సాగే కథలకి ఉండే డిమాండే వేరు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలకు కామెడీ మరియు రొమాన్స్ జోడించడం చాలా సులభం. అందుకే కొత్త తరం... బిటెక్ బాబులు మూవీ రివ్యూ

సినిమా రంగంలో కాలేజీ ఇతివృత్తంగా సాగే కథలకి ఉండే డిమాండే వేరు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలకు కామెడీ మరియు రొమాన్స్ జోడించడం చాలా సులభం. అందుకే కొత్త తరం దర్శకులు ఇలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నారు. ఆ కోవకి చెందినదే ఈ బీటెక్ బాబులు సినిమా. జేపీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం లో నందు, శ్రీముఖి , శౌర్య ముఖ్య పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు శ్రీను ఇమండి ఈ చిత్రానికి దర్శకత్వం చేసారు. యూత్ ని ఆకర్షించే విధంగా రూపొందించబడిన ఈ చిత్రం ఈ వారమే విడుదల అయింది. అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

చాలా రోజుల తర్వాత నందుకి ఒక మంచి పాత్ర లభించింది. పెళ్లి చూపులు సినిమా తర్వాత నందు కి గొప్ప పేరు తెచ్చిపెట్టిన సినిమాలు ఏమి లేవు. ఆ లెక్కన చూస్కుంటే ఆ సినిమా తర్వాత ఇదే అతను చేసిన మంచి సినిమా. శ్రీ ముఖి కూడా ఒక మంచి పాత్ర చేసింది. వీళ్ళు ఇద్దరే ఈ సినిమాకి ప్రధాన బలం. కథ విషయానికి వస్తే నందు కసి తో డైరెక్టర్ అవ్వాలి అనుకునే ఒక కుర్రాడు. అదే సమయం లో అమ్మాయి తో ప్రేమ లో పడతాడు. వారి మధ్య ప్రేమ సన్నివేశాలను దర్శకుడు చాలా చక్కగా తీర్చిదిద్దాడు. వారి ప్రేమను తెలియచేస్తూ అలాగే నందు దర్శకత్వ ప్రయత్నాలు చూపిస్తూనే మధ్య మధ్య లో కామెడీ కూడా పండించాడు దర్శకుడు. ఆలీ తో చేసిన స్పూఫ్ హైలైట్ అని చెప్పచ్చు. కెరీర్ ముఖ్యమా లేక అమ్మాయి ముఖ్యమా అని తేల్చుకోలేని పరిస్థితి లో ఉండే హీరో మనోభావాల్ని బాగా చూపించాడు దర్శకుడు.

కొత్త డైరెక్టర్ అయినా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇతని దగ్గర అనిపించేలా చేసాడు శ్రీను. అప్పుడే వయసులోకి వచ్చే బీటెక్ చదివే కుర్రాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది హీరో మరియు అతని ఫ్రెండ్స్ రూపంలో బాగా చూపించాడు దర్శకుడు. ప్రేమ , పేరెంట్స్, కెరీర్ ఈ మూడింటిని ఎలా బాలన్స్ చేయచ్చు మరియు ఏది ముఖ్యమో ఎలా తేల్చుకోవాలి అనే ప్రశ్నలకి జవాబులు ఈ సినిమా లో దొరకచ్చు. సీరియస్ గా సాగే ఈ కథ లో కామెడీ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజి పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇంకొక నవ్వించే పాత్రలో షకలక శంకర్ అద్భుతంగా నటించాడు. సగ భాగం ఆలీ చూసుకోగా మిగతా సగ భాగం షకలక శంకర్ చూసుకున్నాడు ప్రేక్షకులని నవ్వించడంలో. స్నేహితుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు , ప్రియురాలి తో చిలిపి గొడవలు, అలాగే పేరెంట్స్ తిట్టే తిట్లు ఇవన్నీ ఈ తరం యువత బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి.

మరొక నవ్వించే పాత్రలో తాగుబోతు రమేష్ ఆకట్టుకున్నాడు. అన్ని సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా తాగుబోతు లాగా చేస్తూనే ఒక దొంగ లాగా మనల్ని నవ్విస్తాడు. ఈ సినిమాకి సంగీతం మరొక ఆకర్షణ. ఛాయాగ్రహణం కూడా అద్భుతంగా చేసారు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి వారు తమ సాయిశక్తుల మంచి సినిమా ఇవ్వడానికి ప్రయత్నించారు. తోటి విద్యార్థుల పాత్రల్లో మరియు ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన కొత్త వారు ఆకట్టుకునే విధంగా చేసారు. వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ , పవిత్ర లోకేష్, పటాస్ ప్రకాష్, ఖుష్బూ,సూర్య, వైజాగ్ శంకర్ ఇతర పాత్రలలో ఆకట్టుకున్నారు.

యువతకి ఒక మంచి సందేశం ఇవ్వడమే లక్ష్యంగా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించింది అనే చెప్పాలి. ప్రేమ, కెరీర్ విషయాల్లో స్పష్టత లేక మధనపడే విద్యార్ధులకి ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు అర్ధం అవడం ఖాయం. ఇంట్లో వాళ్ళతో కలిసి హాయిగా చూసి నవ్వుకుంటూనే ఆలోచింపచేసే సినిమా ఇది. మొత్తానికి ఈ బీటెక్ బాబులు సినిమా అటు బీటెక్ విద్యార్థులనే కాకుండా అన్ని రకాల విద్యార్థులని మరియు పెద్దలను ఆకట్టుకునే విధంగా ఉంది.