సాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని మనం సైతం సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ లక్షలాది సైన్యంగా... కాదంబరి కిరణ్ అన్నయ్యతో నాకున్న స్నేహం వయసు 30 ఏళ్లు:పూరీ జగన్నాథ్

సాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని మనం సైతం సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ లక్షలాది సైన్యంగా ఎదుగుతోంది. వందల మంది పేదలు ఆదుకోవాలంటూ ఈ సేవా సంస్థను ఆశ్రయిస్తున్నారు. మనం సైతం దగ్గరకు వచ్చే ఆర్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా మరికొందరు పేదలకు మనం సైతం ఆర్థిక సహాయాన్ని అందించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి జయలలిత, బిగ్ బాస్ విజేత కౌశల్, బుల్లితెర నటుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్, అంజనాదేవి, టీఎన్వీ గాయత్రి, ఝాన్సీ, భాస్కర్, దిలీప్ తేజ లకు చెక్ లను అతిథుల చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటి జయలలిత లక్ష రూపాయలు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ స్వామి గౌడ్, అనిల్, రవి లక్ష రూపాయలు, నిర్మాత బన్నీవాస్ 75 వేల రూపాయలు, కౌశల్ 25 వేల రూపాయల విరాళం ప్రకటించగా…దర్శకుడు పూరీ జగన్నాథ్ మనం సైతంకు ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేసి ఇస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….మన సైతం కార్యక్రమానికి రమ్మని పరిశ్రమకు చెందిన పెద్దలను అడుగుతున్నాను. ఇలా రమ్మనేది సంస్థకు డబ్బులు ఇవ్వమని కాదు. మీలాంటి పెద్దలు వస్తే మరింత మందికి మనం సైతం చేరువవుతుంది. అలా ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతాం.
జయలలిత మాట్లాడుతూ….ఇక్కడికొచ్చి కార్యక్రమం చూస్తుంటే దైవం మానవ రూపంలో ఉంటాడనే మాట గుర్తుకువస్తోంది. దేవుడు అన్నిచోట్లకు రాలేడు. తనకు బదులుగా కొందరు మనుషులను పెడతాడు. అలా దేవుడు తన రూపంలో అందించిన మనిషే కాదంబరి కిరణ్.
బిగ్ బాస్ విజేత కౌశల్ మాట్లాడుతూ…మనం సైతంలో నేను సభ్యుడిని అవడం, కాదంబరి అన్నకు తమ్ముడు అవడం అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తర్వాత నాకు మరో అమ్మ మనం సైతం. కౌశల్ ఆర్మీని ఎలా నడిపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో కాదంబరి గారు మనం సైతం ద్వారా నా అభిమానులకు దారి చూపించారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ….కాదంబరి కిరణ్ అన్నయ్యతో నాకున్న స్నేహం వయసు 30 ఏళ్లు. నేను సహాయ దర్శకుడిగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదో ఒక పని చెప్పి వెయ్యి, రెండు వేలు చేతిలో పెడుతుండేవారు. ఏదైనా పని ఉందా అన్నా అని అడిగితే దూరదర్శన్ కార్యక్రమాలో ఏవో ఒకటి ఇస్తుండేవాడు.