పేరుకే జేడీఎస్ ముఖ్య‌మంత్రి. స‌గ‌భాగం కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే. అందుకే కొన్ని పార్టీలు క‌ర్ణాట‌క సీఎంగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లాలా లేదా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. చూసేందుకు జేడీఎస్ ప్ర‌భుత్వ‌మే అయినా అది కొలువుదీరేందుకు... వెళ్లాలా..వ‌ద్దా..


పేరుకే జేడీఎస్ ముఖ్య‌మంత్రి. స‌గ‌భాగం కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే. అందుకే కొన్ని పార్టీలు క‌ర్ణాట‌క సీఎంగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లాలా లేదా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. చూసేందుకు జేడీఎస్ ప్ర‌భుత్వ‌మే అయినా అది కొలువుదీరేందుకు కాంగ్రెస్ పార్టీనే కీల‌కం. కాంగ్రెస్ ముందుకు రాక‌పోతే జేడీఎస్‌కి అధికారం క‌ల్లోకూడా జ‌ర‌గ‌ని ప‌ని. అందుకే దేవెగౌడ‌తో దోస్తానా ఉన్నా, కుమార‌స్వామిపై సానుకూల‌త ఉన్నా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్తే కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తిచ్చిన‌ట్ల‌వుతుంద‌ని కొన్ని పార్టీలు ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాయి.

మోడీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాక ప‌రాజ‌యాల్ని మూట‌గ‌ట్టుకుంటున్న కాంగ్రెస్‌కి క‌ర్ణాట‌క ప‌రిణామాల‌తో ప్రాణం లేచొచ్చింది. అత్య‌ధిక సీట్లొచ్చినా గోవా, మ‌ణిపూర్‌, మేఘాల‌య‌లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేక‌పోయిన కాంగ్రెస్ క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌కి బేష‌రతు మ‌ద్ద‌తిచ్చి బీజేపీని ఊహించ‌ని దెబ్బ‌కొట్టింది. ఎలాంటి ప‌ద‌వులివ్వ‌క‌పోయినా ఫ‌ర్లేదు…క‌ర్ణాట‌క‌లో బీజేపీకి అధికారం ద‌క్క‌కుంటే చాల‌ని వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

జేడీఎస్‌లాంటి ప్రాంతీయ‌పార్టీకి మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో దేశ‌వ్యాప్తంగా చాలా పార్టీల‌కు సానుకూల‌తే ఉన్నా కాంగ్రెస్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ వ్య‌తిరేక‌భావ‌మే ఉంది. ఇక ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ‌రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకుంటున్న కేసీఆర్ కూడా బీజేపీ-కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాన్నే కోరుకుంటున్నారు. అందుకే చాలా పార్టీల‌ని ఇప్పుడు కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం సంక‌టంలో ప‌డేసింది. జేడీఎస్‌కి మ‌ద్ద‌తుగా వెళ్లినా ప‌రోక్షంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిచ్చిన‌ట్లే. అందుకే కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రైతే కాంగ్రెస్‌కి కూడా జైకొట్టిన‌ట్లు అవుతుంద‌ని కేసీఆర్‌, చంద్ర‌బాబు, మ‌మ‌తాబెన‌ర్జీవంటి నేత‌లు ఆలోచిస్తున్నారు.